వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Viveka Murder case transeffered to Hyderabad CBI Court.వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలను
By తోట వంశీ కుమార్ Published on 29 Nov 2022 12:43 PM ISTతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని, కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఆయన కుమారై వైఎస్ సునీతా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మంగళవారం తీర్పును వెల్లడించింది.
మృతుడి భార్య, కుమారై విచారణపై అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్ కు బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశన్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. హత్య కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది.
మరణించిన వ్యక్తి భార్య, కుమార్తె సుప్రీం కోర్టు వరకు రావడమంటే ఈ కేసులో ఎన్ని కుట్ర కోణాలు దాగి ఉన్నాయో అర్థం అవుతుందని, విచారణపై వాళ్లిద్దరూ అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకుని కేసును బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది.
వైఎస్ వివేకా హత్య కేసులో అనేక కోణాలు ఉన్నాయని, ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు తప్పట్లేదని గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. విచారణకు స్థానిక యంత్రాంగం అసలు ఏమాత్రం సహకరించలేదని తెలిపింది. సీబీఐ ఆరోపణలకు వైఎస్ సునీత మద్దతు తెలపడం, హత్య కేసులో కుట్రను బయటపెట్టాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేయడాన్ని దేశ అత్యున్నత ధర్మాసనం ప్రస్తావించింది.