బంగ్లాలో హిందువులపై హింస.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆందోళన
ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని అందరూ ఖండించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
By అంజి Published on 27 Nov 2024 9:02 AM ISTబంగ్లాలో హిందువులపై హింస.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆందోళన
ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని అందరూ ఖండించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. హిందువులపై దాడులని ఆపాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. బంగ్లా ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిందని, ఎంతో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడటం తీవ్రంగా కలచి వేస్తోందని, ఈ విషయంలో ఐకరాజ్యసమితి కలగజేసుకోవాలని పవన్ ట్వీట్ చేశారు.
చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తర్వాత మంగళవారం బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణించినట్లు ఏఎఫ్‌పీ నివేదించింది. ప్రస్తుతం దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణదాస్‌కు కోర్టు బెయిల్ నిరాకరించడంతో దేశంలో అశాంతి నెలకొంది. ఈ ఘర్షణల్లో సైఫుల్ ఇస్లాం అలీఫ్ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చనిపోయాడు. అలీఫ్ తలకు తీవ్ర గాయాలయ్యాయని చిట్టగాంగ్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ నూరుల్ ఆలం తెలిపారు.
ఇస్కాన్ గురువు కృష్ణదాస్ ఢాకా నుంచి చిట్టగాంగ్‌కు వెళుతుండగా బంగ్లాదేశ్ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. అతని ఆకస్మిక నిర్బంధం అతని మద్దతుదారులచే దేశవ్యాప్త నిరసనకు దారితీసింది. ప్రపంచవ్యాప్త ఖండనకు దారితీసింది. బంగ్లాదేశ్ సమ్మిలిటో సనాతన్ జాగరణ్ జోటే గ్రూపు సభ్యుడు కృష్ణదాస్.. మద్దతుదారులు చిట్టగాంగ్‌లో కోర్టు హాజరు తర్వాత అతడిని తరలిస్తున్న జైలు వ్యాన్‌ను చుట్టుముట్టడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి .
బంగ్లాదేశ్‌లో హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడంపై భారతదేశం మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.