ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గతకొన్ని రోజులుగా దేవతా విగ్రహాల ధ్వంసం చేస్తుండగా.. ఈ సారి ఏకంగా గుడిలోని దేవుడినే అపహరించుకుని పోయారు. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహాం ధ్వంసం ఘటన మరువకముందే తాజాగా కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది.వేముల మండలం చాగలేరు గ్రామంలో ఉన్న వినాయక విగ్రహాన్ని గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అపహరించారు. శుక్రవారం ఉదయం గుడి తలుపులు తెరిచిన పూజారి ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో వెంటనే ఘటనాస్థలికి ఎస్సై సంజీవరెడ్డి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.
ఇదిలా ఉంటే.. రామతీర్థం నిన్న మళ్లీ అట్టుడికింది. నినాదాలతో హోరెత్తింది. భాజపా-జనసేన శ్రేణలు రావడం.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విజయనగరం జిల్లా నెల్లిమర మండలం రామతీర్థంలో కోదండరాముడి విగ్రహ శిరస్సును ధ్వంసం చేసిన ఘటనను నిరసిస్తూ మంగళవారం బీజేపీ, జనసేన నాయకులు ధర్మయాత్ర తలపెట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గురువారం మరోసారి ఛలో రామతీర్థం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దాంతో నెల్లిమర్లలోని రామతీర్థం కూడలిలో పోలీసులు మోహరించారు. ప్రధాన మార్గాలన్నింటీని దిగ్భంధనం చేశారు. భాజాపా, జనసేన శ్రేణులు జై శ్రీరాం అంటూ దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో గందరగోళం పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.