విజయవాడ: షిర్డీ వెళ్లాలనుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెప్పింది ఇండిగో ఎయిర్‌లైన్స్. మార్చి 26 నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యాత్రికుల పట్టణమైన షిర్డీకి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఎయిర్‌లైన్ క్యారియర్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. 72 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల ఏటీఆర్ 72-600 క్యారియర్ ప్రతిరోజూ మధ్యాహ్నం 12:25 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్తుంది. విమాన ప్రయాణం సుమారు మూడు గంటలు. ఆ తర్వాత షిర్డీ చేరుకుంటుంది.
షిర్డీ నుంచి మరో విమానం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంటుందని ఇండిగో ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టిక్కెట్ ధర రూ.4,246గా, షిర్డీ నుంచి గన్నవరం వెళ్లేందుకు రూ.4,639గా నిర్ణయించారు. విజయవాడ నుంచి షిర్డీకి చేరుకోవడానికి దాదాపు 2.50 గంటల సమయం పడుతుందని విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు. రైలు లేదా రోడ్డు మార్గంలో సుదీర్ఘ ప్రయాణ చేయలేని ఏపీ భక్తులకు ఈ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉండనుంది.