విజయవాడ పంజా సెంటర్‌లో గత 40 ఏళ్లుగా సెలూన్ నడుపుకుంటున్న శ్రీనివాసరావు అనే క్షురకుడికి జీఎస్టీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. విశాఖపట్నంలో ఆయన పేరు మీద ఐరన్ స్క్రాప్ వ్యాపారం జరుగుతోందని, దానికి సంబంధించి రూ. 72 లక్షల జీఎస్టీ చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన బ్యాంకు ఖాతాను కూడా అధికారులు నిలిపివేశారు.
రోజుకు కేవలం రూ. 300 నుండి రూ. 400 సంపాదించే తనకు, విశాఖలోని ఇనుప వ్యాపారానికి ఎలాంటి సంబంధం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన పాన్ కార్డ్, ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసి ఈ మోసానికి పాల్పడి ఉంటారని ఆయన అనుమానిస్తున్నారు. ఈ సమస్య వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోవడంతో, తన పేరును ఈ వివాదం నుండి తొలగించి న్యాయం చేయాలని ఆయన అధికారులను వేడుకుంటున్నారు.