Vijayawada: ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలకు ఏర్పాట్లు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏర్పాట్లు చేస్తున్నారు.
By అంజి Published on 24 Sep 2024 6:10 AM GMTVijayawada: ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలకు ఏర్పాట్లు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దుర్గ గుడిలో దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పనులకు టెండర్లు, క్యూలైన్లు సహా అన్ని ఉత్సవాలకు 5 రోజుల ముందే పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. ఐదు క్యూలైన్లలో మూడు ఉచితం, రెండు టిక్కెట్‌పై దర్శనాలు చేసుకునే భక్తులకు కేటాయిస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకుని భక్తులు కిందకు దిగేందుకు తాత్కాలికంగా మెట్ల మార్గాన్ని సిద్ధం చేశారు. కొండ దిగువన వినాయక ఆలయం వద్ద నుంచి క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
ఘాట్ రోడ్డులో క్యూలైన్ వేసే ముందు రోడ్డు మరమ్మతులు, విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఘాట్ రోడ్డు పక్కన రిటైనింగ్ వాల్ కూడా పూర్తి కావడంతో రెండు మూడు రోజుల్లో క్యూలైన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఘాట్‌రోడ్డుపై నుండి భక్తులు దర్శనానికి రానున్న నేపథ్యంలో కొండచరియలు విరిగిపడకుండా రాక్‌మిటిగేషన్ పనులు చేపట్టారు. అలాగే స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఉత్సవాలకు మూడు రోజుల ముందు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దసరా ఉత్సవాల భద్రతా విధుల్లో 3,500 మంది పోలీసులు పాల్గొననున్నారు. వెయ్యి మందికిపైగా ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సేవలు అందించనున్నారు.