బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. విజయసాయిరెడ్డికి తారకరత్న వరుసకు అల్లుడు అవుతారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వచ్చిన విజయసాయిరెడ్డి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. తారకరత్నకు సంబంధించి అన్ని విషయాలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రస్తుతం తారకరత్న గుండె, కాలేయం ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సాఫీగా పనిచేస్తున్నాయని తెలిపారు. గుండెకు ఇవాళ ఎలాంటి చికిత్స అందించలేదని, అయితే తారకరత్న మెదడులో వాపు ఏర్పడిందని వివరించారు. తారకరత్న గుండెపోటుకు గురైన రోజున 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయిందని, దాంతో మెదడులో కొంతభాగం దెబ్బతిన్నదని తెలిపారు. మెదడులో నీరు చేరిన ఈ పరిస్థితిని ఎడిమా అంటారని వివరించారు. దీంతో మెదడు కిందికి జారిపోయే ప్రమాదం ఉందని అన్నారు. మరో మూడ్నాలుగు రోజుల్లో మెదడు ఆరోగ్యానికి సంబంధించిన పురోగతి కనిపించవచ్చని డాక్టర్లు ఇటీవల చెప్పారని వివరించారు. ఇప్పటికే మూడ్రోజులు గడచిపోయింది కాబట్టి, రేపటి నుంచి ఆయన మెదడు ఆరోగ్యం నిలకడగా ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు. డాక్టర్లు అద్భుతమైన చికిత్స అందిస్తున్నారని విజయసాయి కొనియాడారు.
తారకరత్నకు విజయసాయిరెడ్డి బంధువు అన్న సంగతి తెలిసిందే. తారకరత్న భార్య అలేఖ్య విజయసాయిరెడ్డి భార్య సునంద చెల్లెలి కూతురే. అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు అవుతారు.