బైక్ నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరి అని అధికారులు చెబుతూ ఉంటారు. ఎవరైనా సరే.. హెల్మెట్ ధరించాల్సిందే..! కానీ కొందరు ప్రముఖులు మాత్రం కొన్ని కొన్ని సార్లు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఉంటారు. తాజాగా వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి అలా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించారు.


మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో విజయసాయిరెడ్డి ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. విశాఖ 40వ వార్డు వైసీపీ అభ్యర్థి గుండపు నాగేశ్వరరావు, 63వ వార్డు అభ్యర్థి పిలకా రామ్మోహన్ రెడ్డి తరపున ప్రచారాన్ని నిర్వహించారు. మంత్రి అవంతి శ్రీనివాస్, ఇతర నేతలు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. విజయసాయి, అవంతి శ్రీనివాస్ లతో పాటు వారి వెనుక బైక్ లపై వస్తున్న వారెవరూ హెల్మెట్ ధరించలేదు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఏపీలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే రూ. 1000 జరిమానా విధిస్తున్నారు. వీరికి కూడా అదే జరిమానాను విధించాలని డిమాండ్ చేస్తున్నారు.


సామ్రాట్

Next Story