టీడీపీ శిబిరంలో విజయోత్సవ సంబరాలు

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతృత్వంలోని త్రైపాక్షిక కూటమి ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండడంతో ఆ పార్టీ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి.

By అంజి  Published on  4 Jun 2024 11:02 AM GMT
Victory celebrations, TDP camp, Andhrapradesh

టీడీపీ శిబిరంలో విజయోత్సవ సంబరాలు

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతృత్వంలోని త్రైపాక్షిక కూటమి ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండడంతో ఆ పార్టీ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) భారీ మెజార్టీతో దూసుకెళ్తోందని ట్రెండ్స్‌ వెల్లువెత్తడంతో టిడిపి కార్యకర్తలు పటాకులు పేల్చి మిఠాయిలు పంచుకుంటున్నారు. ఈ వేడుకలకు నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో టీడీపీ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.

175 స్థానాలున్న అసెంబ్లీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి 158 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) 20 సెగ్మెంట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. టీడీపీ 131 సెగ్మెంట్లలో ఆధిక్యంతో సొంతంగా అధికారాన్ని చేజిక్కించుకునేలా కనిపిస్తోంది. టీడీపీ మిత్రపక్షాలు నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ (జేఎస్పీ) 20 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ ఏడు సెగ్మెంట్లలో ముందంజలో ఉంది.

మహాకూటమి విజయంపై బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సిద్ధార్థనాథ్ సింగ్ చంద్రబాబునాయుడును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గానూ 21 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యంలో ఉంది. టీడీపీ ఒంటరిగా 16 స్థానాల్లో ముందంజలో ఉండగా, దాని మిత్రపక్షాలైన బీజేపీ మూడు, జనసేన రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఒకటి మినహా టీడీపీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ పోటీ చేసిన ఆరు స్థానాల్లో మూడింటిలో ఆధిక్యంలో ఉంది. జనసేన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ భారీ ఆధిక్యం సాధించింది.

Next Story