ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన శిరోముండనం కేసు బాధితుడు వరప్రసాద్ అదృశ్యమయ్యాడు. దీంతో సీతానగరం పోలీస్ స్టేషన్‌లో వరప్రసాద్ భార్య కౌసల్య ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వరప్రసాద్‌ శిరోముండనం ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. గతేడాది సీతానగరం పోలీస్‌స్టేషన్ పరిధిలో మునికూడలి అనే గ్రామంలో ఇసుకలారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్థానిక యువకులు, లారీ నిర్వాహకుల మధ్య గొడవ జరిగింది.

దీంతో లారీ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా వరప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వరప్రసాద్‌ను పోలీసులు చిత్రహింసలు పెట్టారనే విమర్శలు వచ్చాయి. తనను బెల్ట్‌తో కొట్టారని బాధితుడు వాపోయాడు. తర్వాత శిరోముండనం చేశారని వరప్రసాద్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. వరప్రసాద్‌ శిరోముండనం కేసులో తనకు న్యాయం జరగట్లేదని, నక్సలైట్లలో చేరడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణ కూడా జరుగుతోంది.

అయితే.. కేసు పురోగతి సాధించకపోవడంతో వరప్రసాద్ మనస్తాపంతో ఉన్నాడ‌ని.. తనకు న్యాయం జరగదని.. శిరోముండనం గురించి వేధిస్తున్నారని చెప్పి వాపోయేవాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన వ‌ర‌ప్ర‌సాద్‌.. అప్పటినుంచి ఆచూకీ తెలియ‌క‌కపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వ‌ర‌ప్ర‌సాద్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
సామ్రాట్

Next Story