వైసీపీకి బిగ్ షాక్.. వాసిరెడ్డి పద్మ రాజీనామా
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
By అంజి Published on 23 Oct 2024 11:07 AM ISTవైసీపీకి బిగ్ షాక్.. వాసిరెడ్డి పద్మ రాజీనామా
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో జగ్గయ్యపేట టికెట్ దక్కుతుందని ఆమె భావించారు. కానీ జగన్ సీటు ఇవ్వకపోవడంతో ఆమె అసంతృప్తికి లోనయ్యారు. ఎన్నికలకు ముందు వరకు ఆమె ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు.
పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్.. గుడ్ బుక్, ప్రమోషన్లు అంటున్నారని, నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్‌బుక్ కాదని గుండె బుక్ అని అన్నారు. కార్యకర్తలు, నాయకుల కోసం ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదని వాసిరెడ్డి పద్మ అన్నారు. జీవితాలు , ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గుడ్ బుక్ పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధపడుతున్నారని ఆరోపించారు.
పార్టీని నడిపించడంలో జగన్‌కు బాధ్యత లేదని, పరిపాలన చేయడంలో బాధ్యత లేదని అన్నారు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదని పేర్కొన్నారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడుని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందన్నారు. వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేశానని అన్నారు. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మధనం చెంది వైసీపీ వీడాలని నిర్ణయం తీసుకున్నానని వాసిరెడ్డి పద్మ తెలిపారు.