గుడివాడ: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగారావు వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గుడివాడలో వంగవీటి రంగా వర్ధంతి వేడుకలు నిర్వహిస్తే చంపేస్తామని వైఎస్సార్‌సీపీ నేత మేరుగుమల కాళి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి బెదిరించారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. గుడివాడలోని వంగవీటి రంగా విగ్రహం వద్ద నివాళులు అర్పించేందుకు మద్దతుదారులు ప్రయత్నించడంతో ఘర్షణ చోటుచేసుకుంది.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి గుడివాడ పట్టణంలో 144 సెక్షన్ విధించారు. సోమవారం మాజీ మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు అనుచరులు తమ నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు. హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు వంగవీటి మోహన రంగారావు వర్ధంతిని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించే హక్కు టీడీపీకి లేదని వైఎస్సార్‌సీపీ నేతలు వాదించారు. వంగీవేటి రంగారావు 1988లో దారుణ హత్యకు గురైనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండగా.. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ నాయకులు.. ఇప్పుడు వంగవీటి రంగాను తమవాడిగా చెప్పుకునేందుకు తహతహలాడుతున్నాయి. ఆయన వర్ధంతిని జాతీయ నేతలకు మించి ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వంగవీటి రంగా హత్యకు గురై.. 33 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆయన పేరు సజీవంగానే ఉంది. అణగారిన ప్రజలన కోసం ఆయన అను నిత్యం పోరాడారు. ఓ దశలో తన సొంత పార్టీ కాంగ్రెస్ ను వీడి సొంతంగా రాజకీయ పార్టీ స్ధాపిస్తారనే ప్రచారం కూడా సాగింది. ఏపీ రాజకీయాల్లో మూడు దశబ్దాల క్రితం విజయవాడ కాపు నేత రంగా ఓ వెలుగు వెలిగారు.