Vande Bharat Express : ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో వందేభారత్ రైలు ప్రారంభం..!
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే అవకాశం ఉంది
By తోట వంశీ కుమార్ Published on 25 March 2023 2:23 AMవందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతీకాత్మక చిత్రం
తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ రైలు సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణించనుంది. ఏప్రిల్ 8న ఈ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. నిర్వహణపరమైన ఏర్పాట్లతో అందుకు సిద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే సంబంధిత రైల్వే డివిజన్ల అధికారులకు గురువారం రాత్రి సమాచారం ఇచ్చింది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వయా గుంటూరు మీదుగా ఈ రైలును నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి బీబీనగర్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఈ రైలు తిరుపతికి చేరుకుంటుంది. అయితే ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అన్ని స్టేషన్లలో ఆగుతుందా..? లేక కొన్ని స్టేషన్లలోనే ఆగుతుందా..? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఈ రైలులో టికెట్ చార్జి ఎంత ఉంటుందనే ఇంకా తెలియరాలేదు. త్వరలోనే టికెట్ రేటు ఎంత, ఏ ఏ స్టేషన్లలో రైలు ఆగనుంది అనే వివరాలను రైల్వే అధికారులు తెలియజేయనున్నారు. ఈ రైలు ప్రారంభమైతే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రస్తుతం 12 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం ఆరున్నర గంటల నుంచి 7 గంటలకు తగ్గుతుంది.
సాధారణంగా.. సికింద్రాబాద్- తిరుపతి మధ్య ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ మార్గంలో వందే భారత్ రైలును ప్రవేశపెడితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని, ఈ రైలుకు ఆదరణ ఎక్కువగా లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.