వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన కేసులో నూజివీడు కోర్టులో ఆయన్ను పోలీసులు ప్రవేశపెట్టారు. అంతకుముందు విజయవాడ జైలులో ఉన్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసును పరిశీలించిన ధర్మాసనం వంశీతో పాటు ఆయన అనుచరుడు మోహనరంగారావుకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశించింది.
అంతేకాదు పోలీసుల పీటీ వారెంట్‌కు అనుమతించింది. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. సత్యవర్థన్ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. కానీ జైలులోనే ఉన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో తాజాగా వంశీకి రిమాండ్ పడింది. దీంతో ఆయన్ను పోలీసులు మళ్లీ జైలుకు తరలించారు.