వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన వల్లభనేని వంశీ జ్యుడీషియల్ రిమాండ్‌ను విజయవాడ కోర్టు మరోసారి పొడిగించింది. వంశీతో పాటు కేసులో అరెస్టయిన మిగిలిన నిందితుల రిమాండ్‌ను కూడా ఈ నెల 13వ తేదీ వరకు పొడిగిస్తూ విజయవాడ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కిడ్నాప్ కేసులో వంశీని ప్రధాన నిందితుడిగా (ఏ1)గా పేర్కొంటూ పోలీసులు ఫిబ్రవరి 13, 2025న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బాధితుడు ఎం. సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల ఆరోపణలపై వంశీపై కేసు నమోదైంది. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన దళిత యువకుడు సత్యవర్ధన్‌ను వంశీ, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని ఆరోపణలున్నాయి. కిడ్నాప్ సమయంలో సత్యవర్థన్‌ను హైదరాబాద్, విశాఖపట్నం మధ్య తిప్పినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.