టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేయడానికి 10 మంది వరకు పోటీ పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో వైసీపీ సైకోలు తయారయ్యారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరంలో భూముల విలువ ఎంత ఉందో ఇప్పుడు విలువ ఎంతో గమనించాలని చింతమనేని అన్నారు. గన్నవరం విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న విమానాల సంఖ్య కూడా తగ్గిపోయిందని అన్నారు. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేసిన చరిత్ర జగన్ దని అన్నారు.
చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ముందు ఆయన నియోజకవర్గ పరిస్థితిని చూసుకోవాలని అన్నారు. తాను టీడీపీ గుర్తుపై గెలిచిన మాట నిజమేనని, అదే టీడీపీ గుర్తుతో చింతమనేని ఎందుకు గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. కోడిపందేలు ఆడించుకోవడానికి పర్మిషన్ ఇప్పించాలని కొడాలి నానిని గతంలో చింతమనేని అడిగారని చెప్పారు. తాను చంద్రబాబు స్కూల్ నుంచే వచ్చానని, ఎన్నికల సమయంలో రాజ్యసభ సీట్లను చంద్రబాబు ఎలా అమ్ముకుంటారో తమకు తెలుసని అన్నారు. గన్నవరం నుంచి పోటీ చేయాలని లోకేశ్ కు తాను గతంలోనే సవాల్ విసిరానని తన సవాల్ పై ఆయన ఇంతవరకు స్పందించలేదని అన్నారు.