సంకల్ప సిద్ధి ఈకార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కుంభకోణంలో తనకు సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు, ఓ వర్గం మీడియాపై చర్యలు తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ డీజీపీని కోరారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రరెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే వంశీ మీడియాతో మాట్లాడుతూ... సంకల్ప సిద్ధి కుంభకోణంలో ఓలుపల్లి రంగా ద్వారా తనకు, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలికి మధ్య సంబంధం ఉందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రెస్‌మీట్‌లో అన్నారని చెప్పారు.
బెంగళూరులో రూ.600 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించారని, ఈ కుంభకోణంలో వందల కోట్లు సంపాదించారని నిరాధార ఆరోపణలు చేశారని అన్నారు. గత నెల 26, 27 తేదీల్లో మీడియా ఛానళ్లలో తప్పుడు ప్రచారం లైవ్ టెలికాస్ట్ చేశారన్నారు. గల్ఫ్‌లో కాసినోలు పెట్టానని, చీకోటి ప్రవీణ్‌తో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసి తన పరువు తీసేందుకు టీడీపీ నేతలు విఫలయత్నం చేశారని అన్నారు. చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో తనకు కోడాలి నానికి ఎలాంటి ప్రమేయం లేదని ఈడీ తేల్చిన తర్వాత మౌనం వహించారని చెప్పారు.
సంకల్ప స్కాంలో తనపై చేసిన ఆరోపణలకు తమ వద్ద ఉన్న ఆధారాలను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేయాలని, సీబీఐ, స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపించాలని డీజీపీని కోరినట్లు వల్లభనేని తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీసిన మీడియా సెక్షన్‌పై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు.