తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు.. ఆలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
By అంజి Published on 10 Jan 2025 6:28 AM IST
తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు.. ఆలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిన్న రాత్రి నుంచే పలు వైష్ణవ ఆలయాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఇవాళ తెల్లవారుజామున ఆలయాలను తెరిచిన పూజారులు.. స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఇవాళ శ్రీమహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతోనే భక్తులు పెద్ద సంఖ్యలో వైష్ణవాలయాలకు తరలివస్తారు.
తిరుమలలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు, హారతి, పుష్ప సమర్పణ చేసిన అనంతరం 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. ఇవాళ్టి నుంచి 10 రోజులు శ్రీవారు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వనున్నారు. అటు భద్రాచలంలో ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని తరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.
యాదగిరిగుట్టలోనూ భక్తులు బారులు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ స్వామి వారికి గరుడోత్సవం, తిరువీధి సేవ నిర్వహించనున్నారు. ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. అటు శ్రీశైలంలో ఉత్తర ద్వారం నుంచి స్వామి, అమ్మవార్లను ఉత్తమవూర్తులను వెలుపలికి తీసుకొచ్చి రావణ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి వేళ పుష్ఫార్చన నిర్వహించనున్నారు.