ఏపీలో 18 ఏళ్లు నిండిన వారికి.. మే కాదు జూన్ నుంచి వ్యాక్సినేష‌న్‌..!

Vaccine for above 18 from June in AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2021 3:35 AM GMT
corona vaccination

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించింది. అయితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం జూన్ నుంచి ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం కానున్న‌ట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టీకా వేయించుకోవ‌డానికి 18 ఏళ్లు దాటిన వారంతా కొవిడ్ యాప్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకొనేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. టీకా పంపిణీ కోసం సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు జరగలేదన్నారు. కాబట్టి వీరికి టీకాలు ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.

అందువ‌ల్లే మే 1 నుంచి 18 సంవ‌త్స‌రాలు దాటిన వారికి టీకాల పంపిణీ జ‌ర‌గ‌డం లేద‌ని.. పేర్ల న‌మోదు స‌మ‌యాన్ని త‌రువాత ప్ర‌క‌టిస్తామ‌న్నారు. ఇక ప్ర‌భుత్వ‌, ప్ర‌వేటు ఆస్ప‌త్రుల్లో ఉద్యోగులు అయిద‌డుగుల భౌతిక దూరాన్ని పాటించాల‌ని సూచించారు. క‌రోనా చికిత్స‌లో కీల‌క‌మైన రెమ్‌డిసివిర్ ఇంజెక్ష‌న్ల‌ను ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు అందిస్తామ‌ని చెప్పారు. వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వివ‌రించారు. నిన్న 11,453 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసినట్టు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో 32,810 ఇంజక్షన్లు ఉన్నట్టు చెప్పారు. 4 లక్షల ఇంజక్షన్లకు ఆర్డర్ ఇచ్చామని, ఈ వారంలో మరో 50 వేలు వస్తాయని సింఘాల్ తెలిపారు.


Next Story