ఏపీలోని కాకినాడ జిల్లా బెండపూడి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు.. అమెరికా యాసలో ఇంగ్లీష్ భాషలో ప్రతిభను కనబరుస్తున్న విషయం తెలిసిందే. బెండపూడి విద్యార్థుల ప్రతిభ గురించి తెలుసుకున్న అమెరికన్ కాన్సులేట్ జనరల్ డోనాల్డ్ హెప్లిన్.. శుక్రవారం వారితో వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. విద్యార్థులు అమెరికా యాసలో ఇంగ్లీష్ మాట్లాడడంపై ఆయన అభినందలు తెలిపారు. అంతకుముందు బెండపూడి విద్యార్థులు అమెరికా యాసలో ఇంగ్లీష్‌లో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. విద్యార్థులను ప్రత్యేకంగా పిలిపించుకుని ముచ్చటించారు.
ఇది కాస్తా నేషనల్ మీడియాలో ప్రసారం అయ్యింది. అమెరికన్ కాన్సులేట్ అధికారుల దృష్టిలో పడటంతో.. బెండపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయాన్ని అమెరికన్ అధికారులు కోరారు. వెంటనే విద్యాశాఖ ఆధ్వర్యంలో వెబ్‌ఎక్స్ కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులతో యూఎస్ కాన్సులేట్ జనరల్ డోనాల్డ్ హెప్లిన్ మాట్లాడేందుకు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత డోనాల్డ్ హెప్లిన్‌తో విద్యార్థులు మేఘన, రీష్మ, తేజస్విని, వెంకన్నబాబు మాట్లాడారు. డోనాల్డ్ హెప్లిన్.. సుమారు 20 నిమిషాల పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించారు. ఎంత మందికి అమెరికాలో చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందని అడగగా.. విద్యార్థులంతా అమెరికాలో చదువుకునేందుకు ఇంట్రెస్ట్ ఉందని బదులిచ్చారు.