హిందూ దేవాలయాలే లక్ష్యంగా కొందరు దుండగులు రెచ్చిపోతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో దాడులు తగ్గాయని జనం కాస్త ఊపిరిపీల్చుకుంటుండగానే చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలో దారుణం జరిగింది. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలోని పాత రథ చక్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గమనించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
అయితే.. అప్పటికే రథచక్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. రథం శిథిలావస్థకు చేరుకోవడంతో కొంతకాలంగా గోశాల పక్కన ఉంచినట్టుగా తెలుస్తోంది. ఎవరైనా కావాలని చేశారా..? ఎందుకు చేశారు..? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. అయితే.. భద్రతా వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని కొందరు భక్తులు అంటున్నారు.
కాగా.. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు తగ్గుముఖం పట్టాయని అందరూ భావిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై మళ్లీ చర్చ మొదలైంది.