ఆంధ్రప్రదేశ్‌కు 30 ఈఎస్‌ఐ ఆస్పత్రులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. భూకేటాయింపులు పూర్తైన వెంటనే వీటి నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. అమరావతిలో రూ.250 కోట్లతో 400 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి రాబోతోందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి సుమారుగా వంద నిర్మాణాలు జరగాల్సి ఉందని, ఆయా శాఖలతో సంప్రదించి పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు ప్రభుత్వాస్పత్రికి అభివృద్ధికి వేగవంతంగా చర్యలు చేపట్టామని తెలిపారు.
జీజీహెచ్ అభివృద్ధికి 60 అంశాలతో కూడిన అజెండాపై సంబంధిత అధికారులతో సమీక్ష చేపట్టినట్టు కేంద్రమంత్రి పెమ్మసాని తెలిపారు. రక్త పరీక్షలన్నీ ఆస్పత్రిలోనే నిర్వహించి, జీజీహెచ్ లో పేదలకు సంపూర్ణ సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ''పారిశ్రామికవేత్త రామచంద్ర తులసి రామచంద్ర ప్రభు రూ.4 కోట్లతో సర్వీస్ బ్లాక్, పొదిలి ప్రసాద్ మరో భవనం, నాట్కో వారు మరో భవన నిర్మాణానికి ముందుకొచ్చారు. వీరితోపాటు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి సహకరిస్తున్న దాతలందరికీ ధన్యావాదాలు'' అని కేంద్రమంత్రి తెలిపారు.