'ఏపీ అప్పుల లెక్కలు బయటపెట్టిన కేంద్రం'.. అవన్నీ అవాస్తవమన్న మంత్రి బుగ్గన

Union minister pankaj chowdary about ap loans in rajyasabha. ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరాలు తెలిపింది. ఏపీ సర్కార్‌ అప్పు దొరికిన ప్రతీ దగ్గరా..

By అంజి  Published on  26 July 2022 11:43 AM GMT
ఏపీ అప్పుల లెక్కలు బయటపెట్టిన కేంద్రం.. అవన్నీ అవాస్తవమన్న మంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరాలు తెలిపింది. ఏపీ సర్కార్‌ అప్పు దొరికిన ప్రతీ దగ్గరా.. తీసుకున్నట్లు చెప్పింది. 'అప్పులు తీసుకొవచ్చు.. అని పర్మిషన్‌ ఇచ్చిన 3 నెలల్లోనే ఏపీ ప్రభుత్వం సగానిపైగా అప్పులు తీసుకుంది' అని రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్రం, నాబార్డు నుంచి కూడా అప్పులు తీసుకుందని తెలిపారు.

పర్మిషన్‌ ఇచ్చిన 3 నెలల్లోనే సగానికి పైగా రుణాలు తీసుకుంటున్నట్టుగా కేంద్రం తెలిపింది. ఇందుకు సంబంధించిన కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఏపీకి నికర రుణ పరిమితి కింద రూ.44 వేల 574 కోట్లు అప్పు తీసుకునేందుకు కేంద్రం అనుమతించింది. మొదటి 9 నెలలకు రూ.40వేల 803 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే మొదటి మూడు నెలల్లోనే 50 శాతానికి పైగా రుణాలు తీసుకుందని పంకజ్ చౌదరి తెలిపారు.

ఏప్రిల్ నెల వరకు బహిరంగ మార్కెట్ నుంచి రూ.21 వేల 890 కోట్లు, కేంద్రం నుంచి మరో రూ.1,373 కోట్ల 47 లక్షలు రుణం తీసుకుందని వెల్లడించారు. అలాగే నాబార్డు నుంచి రూ.40 కోట్ల 17 లక్షలు రుణం తీసుకుందన్నారు. ఇటీవలే.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై కీలక ప్రకటన చేశారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఏపీ సర్కార్‌ తీసుకున్న రుణం మెత్తం రూ.3 లక్షల 7 వేల 671 కోట్లు అని చెప్పారు.

ఏపీ మాత్రమే అప్పులు చేస్తోందా?: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన

కేంద్రం బయట పెట్టిన లెక్కలపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పందించారు. ఏపీ ప్రభుత్వం మాత్రమే అప్పులు చేస్తున్నట్టు చిత్రీకరిస్తున్నారని.. అన్ని రాష్ట్రాలు అవసరాల కోసం అప్పులు చేస్తున్నాయని బుగ్గన వ్యాఖ్యానించారు. ఏపీ ద్రవ్యలోటు ఎక్కువగా ఉందన్న ఆరోపణలు సరికాదన్నారు. తమ ప్రభుత్వం ఎక్కువ శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటోందన్న ఆరోపణలు కూడా అవాస్తవమని స్పష్టం చేశారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు తక్కువేనని తెలిపారు. తెలంగాణలో ద్రవ్యలోటు 4.13 శాతంగా ఉంటే.. ఏపీలో ఇది 3 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఎవరిని భయపెట్టాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బుగ్గన మండిపడ్డారు.

Next Story