ఏపీకి ప్రత్యేక హోదా లేనట్టే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Union minister nityanand rai about ap special status.ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం మరోసారి పుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, ప్రత్యేక హోదా ఇవ్వలేమని తెలిపింది. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం పునరుద్ఘాటించింది. ఏపీ పునర్విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేశారో కేంద్రం స్పష్టం చేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ అంశంపై అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదన్నారు.
దీంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ స్పందించారు. పునర్విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు అమల్లో ఉన్నాయని, పలు విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని రాయ్ తెలిపారు. విద్యాసంస్థల నిర్మాణాలు, ప్రాజెక్టుల పూర్తికి చాలా సమయం పడుతుందన్నారు. పునర్విభజన చట్టం అమలులో తలెత్తే సమస్యలను ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఇరు రాష్ట్రాల అధికారులతో 24 సమీక్ష సమావేశాలు జరిగాయన్నారు.
ప్రత్యేక ప్యాకేజీతో సంబంధం లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లయినా పునర్విభజన చట్టంలోని అంశాలు నెరవేరలేదని తెలిపారు. అందుకు గల కారణాలు ఏంటో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు.తమకు ఎలాంటి ప్యాకేజీ అవసరం లేదని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.