ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి తూర్పుగోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం దేవీపట్నం మండలం ఇందుకూరు-1లో ఆర్అండ్ఆర్ పునరావాస కాలనీలో పర్యటించారు. పోలవరం నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం కేంద్ర మంత్రి షెకావత్ మాట్లాడుతూ.. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి అన్ని సహాయ సహకారాలను అందిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలబడతామని పేర్కొన్నారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. కాలనీల్లో వసతులు బాగున్నాయని ప్రశంసించారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అన్నారు. కేంద్ర సహాయ సహకారాలతో దీన్ని పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పోలవరం పూర్తి అయితే.. రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. పునరావాస పనులపై అధికారులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, నిర్వాసితులకు గతంలో ఇచ్చిన హామీలను అన్నీ నెరవేరుస్తామని చెప్పారు. పునరావాస కాలనీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.