రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల ఆందోళన.. పలుచోట్ల ఉద్రిక్తత
Unemployed protest on Job notifications in AP.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పదవీ విరమణ వయస్సు
By తోట వంశీ కుమార్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పదవీ విరమణ వయస్సు తగ్గింపును డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, యువజన, విధ్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో కలెక్టరేట్ల కార్యక్రమం పలు చోట్ల ఉద్రిక్తతకు దారి తీసింది. చిత్తూరు, విజయనగరం, విజయవాడ, కడప తదితర ప్రాంతాల్లో విద్యార్థి, యువజన సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని చోట్ల నిరుద్యోగులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతపురం, విజయనగరం జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి ఆందోళనకారులు యత్నించడం వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త ఏర్పడింది.
పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్రంలో వేలాదిగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వెంటనే వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక పదవి విరమణ వయస్సును 62 కు పెంచడం వల్ల నిరుద్యోగులకు నష్టం జరుగుతోందని అందుకని పదవి విరమణ వయస్సును 62 నుంచి 60కి తగ్గించాలన్నారు.
కడపలో నిరుద్యోగులను అడ్డుకునేందుకు పోలీసులు ముళ్లకంచెలు అడ్గుగా వేశారు.ఆందోళనలకు దిగిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరంలో ఉద్యోగ సాధన సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్‌ను నిర్వహించారు. మూడు లాంతర్ల నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను నిరసనలకు అనుమతించ వద్దని కళాశాలల యాజమాన్యాలకు పోలీసులు ముందస్తు నోటీసులు అందజేశారు.