కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో పిల్లికాటుకు గురై ఇద్దరు మహిళలు రేబిస్‌తో మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వేములమాడ ఎస్సీ కాలనీకి చెందిన రిటైర్మెంట్ ఆర్టీసీ కండక్టర్ సల్లి భాగ్యరావు భార్య కమల (64), అదే కాలనీకి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు బొడ్డు బాబురావు భార్య నాగమణి (43) రెండు నెలల క్రితం పిల్లి కాటుకు గురయ్యారు. ఆ సమయంలో మహిళలిద్దరూ టీటీ ఇంజక్షన్ చేయించుకుని మందులు వాడుతున్నారు. ఉపశమనం తర్వాత యథావిధిగా తమ పని తాము చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా నాలుగు రోజుల క్రితం కమల, నాగమణి ఆరోగ్యంలో మార్పు రావడంతో చికిత్స నిమిత్తం ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లారు.
అయితే వారి ఆరోగ్యం మెరుగుపడలేదు. కమల గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10 గంటలకు మృతి చెందింది. నాగమణి శుక్రవారం పిహెచ్‌సిలో చికిత్స పొంది అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరింది. ఆమె కూడా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. మృతుల్లో ఇద్దరికి రేబిస్ సోకినట్లు వైద్యాధికారి డాక్టర్ శొంఠి శివరామ కృష్ణారావు తెలిపారు. సకాలంలో వైద్యసేవలు అందకపోవడంతో శరీరం విషపూరితమైందన్నారు. మహిళలను కరిచిన పిల్లిని కుక్క కరిచిందని, కొద్దిరోజుల తర్వాత కుక్క కూడా చనిపోయిందని గ్రామస్తులు తెలిపారు.