పేర్ని నాని వర్సెస్ నాగబాబు.. ఈ ట్విట్టర్ వార్ ఎందుకో..!

Twitter War Between Nagababu And Perni Nani. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోల రద్దు, టికెట్ల వివాదం పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.

By Medi Samrat  Published on  12 April 2021 10:06 AM IST
nani vs Nagababu

వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోల రద్దు, టికెట్ల వివాదం పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాంటి పనులు చేస్తాడంటే తాను నమ్మనని.. పాలనా పరమైన కార్యక్రమాలతో జగన్ తీరికలేకుండా ఉంటారని, స్థానికంగా ఉండే కొందరు ప్రజాప్రతినిధులు, ఇతర రాజకీయనేతలు బెనిఫిట్ షోల రద్దుకు కారకులని తాను భావిస్తున్నట్టు వెల్లడించారు. జగన్ కు ఈ విషయం తెలిస్తే తప్పకుండా స్పందిస్తారని నాగబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయ పరమైన కారణాలతో వృత్తిపరమైన జీవితంపై ఇలా వ్యవహరించడం సరికాదని, సినిమాపై ఆధారపడే ఎంతోమంది కార్మికులు, వారి కుటుంబాలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు.

మరో వైపు ఏపీ మంత్రి పేర్ని నానితో ట్విట్టర్ లో నాగబాబు చిన్న పాటి కామెంట్ల వార్ నడిపారు. పేర్ని నాని బెనిఫిట్ షోల గురించి మాట్లాడుతూ రాజకీయాలకు, సినిమాలకు సంబంధమేంటని ప్రశ్నించారు. చట్టం ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి ఉంది.. దురద ఉందని తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తే షో వెయ్యరు అన్నారు. పేర్ని నాని మాటలకు నాగబాబు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 'మీకు ఏమి అయ్యింది నాని గారు. మీరు కారోనా వాక్సిన్‌తో పాటు రేబిస్ వాక్సిన్ వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీస్ సెండ్ రేబిస్ వాక్సిన్ to మిస్టర్ నాని. స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ.' అంటూ ట్వీట్ చేశారు.

నాగబాబు ట్వీట్‌కు మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. 'పరోపకారి పాపన్న నాగబాబు గారు, పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు రాబిస్ వాక్సిన్ తక్షణ అవసరం వెంటనే వెతికి వేయించండి. ఆలస్యమైతే మీకు కూడా అవసరమౌతుంది. అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు' అంటూ చెప్పుకొచ్చారు.



Next Story