తుంగభద్ర డ్యాం వద్ద ఉన్న స్పిల్‌వే గేటు ఆగస్టు 10వ తేదీ అర్థరాత్రి కొట్టుకుపోవడంతో అధికారులు, స్థానికుల్లో ఆందోళన మొదలైంది. డ్యామ్ నుండి నీటిని విడుదల చేస్తున్న సమయంలో గేట్ నంబర్ 19 కొట్టుకుపోయింది. రాత్రి 10:50 గంటలకు ఈ సంఘటన జరిగింది. అంతకుముందు రోజు 12 నుంచి 21 నంబర్లలో ఉన్న పది స్పిల్‌వే గేట్లను 1.5 అడుగుల ఎత్తులో ఆపరేట్ చేసి 22,890 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గేటు ధ్వంసమైన నేపథ్యంలో తుంగభద్ర డ్యాం బోర్డు వెంటనే బళ్లారి, విజయనగరం, రాయచూర్, కొప్పల్, కర్నూలు జిల్లాల్లోని విపత్తు నిర్వహణ అధికారులతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం అందించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని సమీక్షించారు. అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ అంశంపై తుంగభద్ర డ్యాం అధికారులతో మాట్లాడాలని మంత్రి పయ్యావుల కేశవ్‌కు చంద్రబాబు సూచించారు. తాత్కాలిక గేట్ ఏర్పాటుపై మాట్లాడాలన్నారు. ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఉంటుందన్నారు.