రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఆంజనేయుని ముందు పిల్లకోతి కుప్పి గంతులు వేసినట్లు పెద్దిరెడ్డి తీరు ఉందని ఆయన విమర్శించారు. శనివారం ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని, అందులో పెద్దిరెడ్డి కూడా ఒక మంత్రి అని గుర్తు చేశారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నైజాన్ని వైసీపీ నాయకులు మానుకోవాలని తులసిరెడ్డి హితవు పలికారు.
పెండింగ్ బిల్లులు చెల్లించి మా ప్రాణాలు కాపాడండి. నాడు.. పోషకులం.. నేడు యాచకులం.. అంటూ కాంటాక్టర్లు అర్ధ నగ్నంగా మోకాళ్ళపై భిక్షాటన చేయడం దురదృష్టకరమని తులసిరెడ్డి అన్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకొకటి ఉండదని తీవ్రస్థాయిలో విమర్శించారు. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు ఇళ్ళ నిర్మాణానికి సరిపోవని, ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని, అంతవరకు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టవద్దని రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడం హర్షనీయమని తులసిరెడ్డి అన్నారు.