తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక ఆ ఇబ్బందులుండవ్

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. సాధారణ రోజుల్లో కంటే.. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల ప్రవాహం తిరుమలకు ఎక్కువగా ఉంటుంది.

By అంజి  Published on  3 Oct 2024 7:23 AM IST
TTD, Tirumala Srivaru, devotees,APnews

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక ఆ ఇబ్బందులుండవ్

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. సాధారణ రోజుల్లో కంటే.. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల ప్రవాహం తిరుమలకు ఎక్కువగా ఉంటుంది. పైగా దసరా హాలిడేస్‌ కూడా కలిసి వచ్చాయి. దీంతో పెద్ద సంఖ్యలో జనం.. ఆ వెంకన్న దేవుడిని దర్శించుకునేందుకు పయనమవుతారు. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక్కరోజులోనే దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేశామని తెలిపింది.

ఇక అదే రోజు వాహనసేవల్లో కూడా పాల్గొనవచ్చంది. అటు వీఐపీ సిఫార్సు దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు టీటీడీ రద్దు చేసింది. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే దర్శనాలు ఉంటాయని తెలిపింది. గరుడసేవ రోజున (అక్టోబర్ 8) వీఐపీ దర్శనాలు కూడా రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు టీటీడీ తెలిపింది.

బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాల నిమిత్తం ఆన్‌లైన్‌లో 1.32 లక్షల టికెట్లను ఇచ్చారు. అలాగే నేరుగా సర్వదర్శనానికి వచ్చేవారికి రోజుకు 24 వేల దర్శనం టికెట్లను ఇవ్వనున్నారు. వాహన సేవల్లో రోజుకు 80 వేల మంది భక్తులు పాల్గొంటారని, గరుడవాహన సేవ రోజున లక్షమంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా. సుమారు 2 లక్షల మంది ప్రత్యక్షంగా గరడవాహన సేవను వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. తిరుమలకు వచ్చే భక్తులకు అన్న, పానీయాల కొరత లేకుండా చూస్తామని టీటీడీ పేర్కొంది.

Next Story