గత నెలలో సరిహద్దుల్లో దొరికిన 120 బస్టాల తలనీలాలపై ఎట్టకేలకు టీటీడీ స్పందించింది. ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. భారత్‌- బర్మా సరిహద్దుల్లో తలనీలాల స్మగ్లింగ్‌ కలకలం సృష్టించింది. మిజోరం సరిహద్దులగుండా 120 బ్యాగుల్లో తల వెంట్రుకలను మయన్మార్‌ మీదుగా చైనాకు స్మగ్లింగ్‌ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ వాహనాలను భారత సైన్యానికి చెందిన అసోం రైఫిల్స్‌ పట్టుకుంది. ఈ కేశాలను తిరుపతి నుంచే రవాణా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

మయన్మార్‌తో మిజోరంకు 510 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇక్కడి నుంచి పలురకాల వస్తువుల స్మగ్లింగ్‌ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతూ ఉంటుంది. ఫిబ్రవరి 7న కస్టమ్స్‌ విభాగంతో కలిసి అసోం రైఫిల్స్‌ సెర్చ్‌షిప్‌ బెటాలియన్‌ జవాన్లు ఉమ్మడి ఆపరేషన్‌ చేపట్టారు. మయన్మార్‌ సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలో రెండు ట్రక్కులను అడ్డుకున్నారు. వాటిలో 120 బస్తాల తల వెంట్రుకలు బయటపడ్డాయి. డ్రైవర్లను విచారించగా వాటిని తిరుపతి నుంచి తరలిస్తున్నట్లు తేలింది. పట్టుబడిన వెంట్రుకల విలువ రూ.1.80 కోట్లుగా కస్టమ్స్‌ అధికారులు నిర్ధారించారు.

తిరుపతి తరహాలోనే దేశవ్యాప్తంగా పలు పుణ్యక్షేత్రాల నుంచి వెంట్రుకలు ఇలా అక్రమంగా మయన్మార్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. వీటిని తొలుత థాయ్‌లాండ్‌ చేరుస్తారని, అక్కడ ప్రాసెస్‌ చేశాక చైనాకు తరలిస్తారని సమాచారం. చైనాలో వాటిని విగ్గులుగా మార్చి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ విగ్‌ మార్కెట్లో చైనాకు 70 శాతం వాటా ఉండడం గమనార్హం.

అయితే మిజోరంలో పట్టుబడిన తల వెంట్రుకలతో తమకెలాంటి సంబంధం లేదని టీటీడీ పేర్కొంది. దీనిపై మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ వద్ద ఉన్న తలనీలాలను ఈ-ప్లాట్‌ఫాం ద్వారా అంతర్జాతీయ టెండర్లు పిలిచి ఎక్కువ మొత్తం కోట్‌ చేసిన వారికి విక్రయిస్తామని, సంబంధిత బిడ్డర్‌ నుంచి జీఎ్‌సటీ కూడా కట్టించుకుని తలనీలాలను అప్పగిస్తామని, బిడ్డర్‌కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులున్నాయా? లేక దేశంలోనే ఏ ప్రాంతంలోనైనా విక్రయిస్తారా అనేది తమకు సంబంధించిన విషయం కాదని టీటీడీ స్పష్టం చేసింది.

మయన్మార్‌ సరిహద్దుల్లో వెంట్రుక‌లను పట్టుకున్న అధికారులు అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల వివరాలు అధికారికంగా తెలియజేస్తే వాటిని బ్లాక్‌ లిస్టులో పెడతాం అని తెలిపింది. ఇంకోవైపు.. తలనీలాల అంశంపై టీటీడీపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఈవో ధర్మారెడ్డి హెచ్చరించారు. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం.


సామ్రాట్

Next Story