తిరుమలకు వెళ్తున్నారా.. ఈ వివరాలు మీకోసమే!!

తిరుమల శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాల్సిందిగా టీటీడీ కోరింది.

By అంజి  Published on  15 Feb 2025 9:15 PM IST
TTD, devotees, Tirumala

తిరుమలకు వెళ్తున్నారా.. ఈ వివరాలు మీకోసమే!! 

తిరుమల శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాల్సిందిగా టీటీడీ కోరింది. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేశామనీ, అయినప్పటికీ ఇటీవల కొంత మంది భక్తులు తమకు కేటాయించిన సమయాని కంటే ముందే క్యూలైన్ల వద్దకు వెళ్లి లోపలికి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారని టీటీడీ తెలిపింది. ఈ విషయమై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని టీటీడీ తెలిపింది. శ్రీవారి దర్శన టోకెన్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి మాత్రమే క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ సూచించింది.

గురువారం నాడు రాత్రి అలిపిరి నడక మార్గంలోని 7వ మలుపు సమీపంలోని ముగ్గుబావి దగ్గర చిరుత కదలికలను భక్తులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో రంగంలోకి దిగిన సిబ్బంది పెద్ద పెద్ద శబ్దాలు చేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. తిరుమల నడక మార్గంలో చిరుత తిరుగుతుండటంతో టీటీడీ అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 12 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి నడక మార్గంలో అనుమతించడం లేదు. ఇక రాత్రి 9 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసి వేస్తున్నారు. స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులను ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం గుంపులు గుంపులుగా వదిలి పెడుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా చూస్తున్నారు.

Next Story