విశాఖలో విషాదం..కాలు విరిగి ఆపరేషన్ చేయించుకుంటే బాలుడి ప్రాణం పోయింది

విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో (KGH) శస్త్రచికిత్స అనంతరం ఆరేళ్ల బాలుడు అక్షయ్ కుమార్ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది

By -  Knakam Karthik
Published on : 8 March 2026 8:21 PM IST

Andrapradeh, Visakhapatnam, KGH Hospital, Medical Negligence, Child Death

విశాఖలో విషాదం..కాలు విరిగి ఆపరేషన్ చేయించుకుంటే బాలుడి ప్రాణం పోయింది

విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో (KGH) శస్త్రచికిత్స అనంతరం ఆరేళ్ల బాలుడు అక్షయ్ కుమార్ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. హోలీ ఆడుతూ నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి పడి కుడి కాలు విరిగిన అక్షయ్‌కు, ఈ నెల 5న వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే, ఆ తర్వాత బాలుడికి తీవ్రమైన తలనొప్పి రావడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ, ఆదివారం ఉదయం పరిస్థితి విషమించి మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని తండ్రి విజయ్ కుమార్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు, వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని, అన్ని ప్రోటోకాల్స్ పాటించామని స్పష్టం చేస్తూ, పోస్ట్‌మార్టం తర్వాతే మరణానికి గల అసలు కారణం తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, భవన నిర్మాణ నిర్వాహకుల బాధ్యతపై కూడా ఆరా తీస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వపరంగా రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Next Story