పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మ్యాన్‌హోల్‌లో పడి ముగ్గురు మృతి చెందారు. సత్తెనపల్లిలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న న్యూ వినాయక ఫ్యామిలీ రెస్టారెంట్‌లో డ్రైనేజీ క్లీన్ చేసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగిన ఇద్దరు కార్మికులు, బిల్డింగ్ యజమాని ప్రమాదవశాత్తూ మృతి చెందారు. మృతులను అనిల్, బ్రహ్మం, బిల్డింగ్ యజమాని కొండలరావుగా గుర్తించారు. మ్యాన్‌హోల్‌లో ఊపిరి ఆడకపోవడంతోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రెస్టారెంట్ బిల్డింగ్ యజమాని కొండలరావు.. డ్రైనేజీని క్లీన్ చేసేందుకు ఇద్దరు కూలీలను తీసుకొచ్చాడు. మ్యాన్‌హోల్‌లోకి దిగిన ఇద్దరు కూలీలు ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో ఆయన కూడా అందులోకి దిగారు. ఎంతసేపటికి కొండలరావు కూడా బయటకు రాకపోవడంతో.. అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు.. ముగ్గురు డ్రైనేజీలోనే మృతి చెందినట్లు గుర్తించారు. ఫైర్ సిబ్బంది సహకారంతో ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే.. కాకినాడ జిల్లాలోని ఏటిమొడలోని పోర్ట్ కెనాల్ రోడ్డు నిర్మాణంలో ఉన్న బార్జ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఒక్కసారిగా గ్యాస్ హోస్ పైపు తెగిపోయి పేలింది. శ్రీను, రవి అనే కార్మికులకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయారు. బార్జీ కళాసీ ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని తోటి కార్మికులు, వన్ టౌన్ పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. బాధిత కుటుంబాల్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి భరోసా ఇచ్చారు.