అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాంట్రోతుపుట్టు ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే వాహనంపై ఉన్న తండ్రి తీవ్ర గాయాలతో బయటపడగా, స్థానికులు గమనించి వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. అతివేగం లేదా మలుపు వద్ద అదుపు తప్పడం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.