అనకాపల్లి జిల్లాలో విషాదం.. కలుషితాహారం తిని నలుగురు విద్యార్థులు మృతి
అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నలుగురు విద్యార్థులు మృతి చెందారు.
By అంజి Published on 19 Aug 2024 4:15 PM ISTఅనకాపల్లి జిల్లాలో విషాదం.. కలుషితాహారం తిని నలుగురు విద్యార్థులు మృతి
అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నలుగురు విద్యార్థులు మృతి చెందారు. రెండు రోజుల కిందట అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో ఓ సంస్థ స్పాన్సర్ చేసిన సమోసాలు తిని విద్యార్థులు అస్వస్థత బారిన పడ్డారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం నాడు నలుగురు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులను జాషువా, భవాని, శ్రద్ధ, నిత్యగా పోలీసులు గుర్తించారు. మరో 24 మంది విద్యార్థులకు నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోంది. కాగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు చెందిన 80 మందికి పైగా పిల్లలు గత కొన్నేళ్లుగా అనాథశ్రమంలోనే ఉంటూ సమీపంలోని పాఠశాలల్లో చదువుతున్నారు.
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఏడుగురు, అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 17 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డీఈవో అప్పారావు విచారణ చేపట్టారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన ఇతర విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. అలాగే ఘటనకు గల కారణాలపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. అనకాపల్లి ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు జిల్లా కలెక్టర్లతో మాట్లాడినట్లు వెల్లడించారు. కాగా ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు రెవెన్యూ, పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు అనాథశ్రమంను సందర్శించారు.