భారీగా తగ్గిన టమాటా ధర.. సామాన్యుడి ఆనందం.. రైతన్న ఆక్రోశం
Tomato Rate down in local markets in AP.నిన్న మొన్నటి వరకు సామాన్యులకు చుక్కలు చూపించిన టమాటా ధర నేడు
By తోట వంశీ కుమార్ Published on 16 Dec 2021 1:13 PM ISTనిన్న మొన్నటి వరకు సామాన్యులకు చుక్కలు చూపించిన టమాటా ధర నేడు భారీగా పడిపోయింది. నిన్నటి వరకు వరకు కిలో టమాటా రూ.70 నుంచి రూ.100 వరకు పలుకగా.. ప్రస్తుతం సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. సగానికి పైగా ధర పడిపోయింది. వివిధ ప్రాంతాల్లోని రైతు మార్కెట్లలోని నేటి టమోటా ధరలు రూ.35 నుంచి రూ.50 మధ్య ఉన్నాయి. తీరా టమాటా పంట చేతికొచ్చే సమయంలో ఇలా ధరలు పడిపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో టమోటాను అధికంగా పండిస్తారు. అయితే.. గత రెండు మూడు సంవత్సరాలుగా ధర ఉన్న సమయంలో వర్షాలు, వరదలు వచ్చి.. చేతికి పంట అంది వచ్చే సరికి ధర లేకపోవడంతో అక్కడి టమాటా రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. ఇక ఈ ఏడాది కూడా అలాగే జరిగింది. కష్టనష్టాలకు ఓర్చి టమోటా సాగు చేస్తే.. తీరా మార్కెట్ కు పంటను తీసుకొచ్చేసరికి ధరలు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇతర రాష్ట్రాలనుంచి టమాటా దిగుమతి ఉండడంతో.. ఇప్పుడు స్థానిక టమాటా ధర పంటకు ధర వచ్చే పరిస్థితులు లేవు. దీంతో స్థానిక టమాటా పంటకు ధరలు లేక రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టమాటా పంటను పండించిన తాము నష్టపోతుంటే కమిషన్ వ్యాపారాలు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారని నందిగామ మార్కెట్ లో రైతులు వాపోతున్నారు. పండించిన తాము నష్టపోతుంటే, ఇతర ప్రాంతాల నుంచి టమోటా దిగుమతి చేసుకుని రైతు బజార్ లలో కమీషన్ పద్దతిపై వ్యాపారం చేసే కమీషన్ దారులు కోట్లకు పడగలెతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళారుల ప్రమేయంపై చర్యలు తీసుకుని స్థానిక రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు కోరుతున్నారు.