వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ ఉచిత పంటల బీమా
Today CM Jagan to release YSR Free Crop Insurance compensation.ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతున్నారు. దీంతో
By తోట వంశీ కుమార్ Published on 14 Jun 2022 4:16 AM GMTప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతున్నారు. దీంతో అప్పుల పాలు అవుతున్నారు. కొందరు అప్పులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు సీఎం జగన్. అందుకనే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు రైతులను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం 'వైఎస్సార్ ఉచిత పంటల బీమా' పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో 2021 ఖరీఫ్‌లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు నేడు బీమా పరిహారాన్ని అందించనున్నారు. రైతన్నల ఖాతాల్లో రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం జమ చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
రైతుల తరుపున పూర్తీ ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. సాగు చేసిన ప్రతి ఎకరాన్ని ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్‌లో నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తోంది. బీమా పరిహారం సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒక సీజన్ పంటల బీమా మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే క్రమం తప్పకుండా చెల్లిస్తోంది వైసీపీ ప్రభుత్వం.
పంట వేసినప్పుడే ఈ క్రాప్‌లో నమోదు చేయించి రసీదు ఇస్తున్నారు. పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేస్తున్నారు. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ బీమా అందుతోంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 44.28 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,684.84 కోట్లు లబ్ధి చేకూర్చింది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో రైతులకు అన్ని పథకాలూ కలిపి రూ. 1,27,823 కోట్లు సాయం అందింది.