పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై నేడు స్పష్టత..?
Today Clarity on 10th and inter exams.ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి, ఇంటర్ పరీక్షల రగడ హైకోర్టుకు చేరింది.
By తోట వంశీ కుమార్ Published on 29 April 2021 11:00 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి, ఇంటర్ పరీక్షల రగడ హైకోర్టుకు చేరింది. రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని సీఎం జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్ని వినతులు సమర్పించినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అందులో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతంగా ఉన్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం అనేది విద్యార్థుల ప్రాణాలమీదకు తేవడమేనని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. సీబీఎస్ఈ సహా పలు రద్దు అయ్యాయని, రాష్ట్రంలోనూ పరీక్షలు రద్దు లేదా వాయిదా వేయాలని పిటిషన్లరు కోరారు. దీనిపై నేడు హైకోర్టు విచారించే అవకాశం ఉంది.
సీఎం జగన్ ఏం చెప్పారంటే..?
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమన్నారు. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయమని డిమాండ్ చేయడం సులభమని.. కానీ అలా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఉన్నత చదువల కోసం ప్రయత్నించినా.. ఉద్యోగాల వేటలో ఇంటర్వ్యూకు వెళ్లినా పది, ఇంటర్ పరీక్షల్లో మార్కులే పరిగణలోకి తీసుకుంటారని.. కేవలం సర్టిఫికేట్ పై పాస్ అని ఉంటే వారి భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి భరోసా కల్పిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం జగన్ అన్నారు.
విపక్షాల మండిపాటు..
సీఎం జగన్ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. జగన్‌కు అంత మొండి పట్టుదల ఎందుకని వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ దీనిపై భారీ ఉద్యమం కూడా చేపట్టింది. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటూ మొదట సీఎం జగన్, తరువాత గవర్నర్ కు నారా లోకేష్ లేఖలు రాశారు. అటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లి దండ్రులు పరీక్షలను రద్దు చేయాలని తమను కోరారని టీడీపీ నేతలు అంటున్నారు.