ఇంటర్ పరీక్షలపై ఏపీ సర్కారు అఫిడవిట్.. ఒక్కరు చనిపోయిన కోటి పరిహారం ఇవ్వాలన్న సుప్రీం
Today AP Affidavit came to hear in supreme court.ఎట్టిపరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్
By తోట వంశీ కుమార్ Published on 24 Jun 2021 6:46 AM GMTఎట్టిపరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని బావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రంలో గత నెలతో పోల్చితే కరోనా కేసులు బాగా తగ్గాయని తెలిపింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఆదేశాల మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ తరఫున ప్రభుత్వ న్యాయవాది మెహ్‌ఫూజ్ నజ్కీ అఫిడవిట్ దాఖలు చేశారు.
కాగా.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని, సిబ్బంది,విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది. ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికి రూ.1కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని సూచించింది. జూలై చివరిలో నిర్వహిస్తామని చెప్పారు గానీ.. పరీక్ష తేదీలను వెల్లడించలేదని మండిపడింది. 15 రోజుల ముందుగా టైం టేబుల్ ఇస్తే.. ఆ సమయం సరిపోతుందని ఎలా చెబుతారని ప్రశ్నించింది. సరైన గాలి, వెలుతురు ఉండే పరీక్షలు నిర్వహించే గదుల వివరాలేవీ అఫిడవిట్ లో లేవని చెప్పింది. ప్రభుత్వం తెలిపిన వివరాల మేరకు సుమారు 28వేల గదులు అవసరం అవుతాయని అభిప్రాయ పడింది.
పరీక్షలు నిర్వహించగానే పని అయిపోయింది అని అనుకోలేము గదా.. వాటిని మూల్యాంకనం చేయాలి, ఆతరువాత చాలా ప్రక్రియ ఉంటుందని తెలిపింది. ఇందుకు సంబందించిన వివరాలేమీ అఫిడవిట్‌లో కనిపించలేదని పేర్కొంది. రెండో దశ తీవ్రత చూసి పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణలు చెబుతున్నప్పటికి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఒక నిర్ణయాత్మక ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడింది. అవసరం అయితే.. సీబీఎస్ఈ, యూజీసీ,ఐసీఎస్ఈ బోర్డు సలహాలు తీసుకోవాలని సూచించింది. ఇక గ్రేడ్లను మార్కులుగా మార్చడం కష్టమే అయినప్పటికి.. పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఇక పరీక్షలు జరుగుతున్న సమయంలో మూడో వేవ్ వస్తే.. ఏం చేస్తారని ప్రశ్నించింది. కొంతసమయం ఇస్తే ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని ఏపీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో రేపటికి విచారణను వాయిదా వేశారు.