'తిరుపతి లడ్డూలలో బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్'.. ల్యాబ్ రిపోర్ట్ తప్పయ్యే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూలలో జంతువుల కొవ్వులు, చేప నూనెలు ఉన్నాయని ల్యాబ్ నివేదిక ధృవీకరించింది.
By అంజి Published on 20 Sep 2024 2:45 AM GMT'తిరుపతి లడ్డూలలో బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్'.. ల్యాబ్ రిపోర్ట్ తప్పయ్యే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూలలో జంతువుల కొవ్వులు, చేప నూనెలు ఉన్నాయని ల్యాబ్ నివేదిక ధృవీకరించింది. తిరుపతి లడ్డూ తయారీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ (వైఎస్ఆర్సీపీ) ప్రభుత్వం జంతువుల కొవ్వు, నాసిరకం పదార్థాలను ఉపయోగించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
పశుగ్రాసం, పాలు, పాల ఉత్పత్తులను పరీక్షించడంపై దృష్టి సారించిన ప్రైవేట్ ప్రయోగశాల NDDB CALF నివేదిక.. తిరుపతి లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యి నమూనాలలో పామాయిల్, చేప నూనె, బీఫ్ టాలో, పందికొవ్వుతో సహా విదేశీ కొవ్వులు ఉన్నాయని వెల్లడించింది. ఈ నివేదిక కాపీని అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి షేర్ చేశారు.
తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి తయారీలో బీఫ్ టాలో, జంతువుల కొవ్వు, పందికొవ్వు, చేపనూనె వాడినట్లు నమూనాల ల్యాబ్ రిపోర్టులు ధ్రువీకరిస్తున్నాయని, ఎస్ విలువ 19.7 మాత్రమేనని ఆనం వెంకట రమణారెడ్డి చెప్పారు.
చంద్రబాబు నాయుడు ఆరోపణల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. 'తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం మనకు అత్యంత పవిత్రమైన దేవాలయం. తిరుపతి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతు కొవ్వును వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారని తెలిసి షాక్ అయ్యాను' అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇదిలావుండగా సీఎం చంద్రబాబు ఆరోపణను వైఎస్ఆర్‌సిపి "దురుద్దేశపూరితమైనది" అని పేర్కొంది. టిడిపి అధిష్టానం "రాజకీయ లబ్ధి కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతుంది" అని మండిపడింది. తన వ్యాఖ్యలతో పవిత్ర తిరుమల పవిత్రతను, కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని నాయుడు తీవ్రంగా దెబ్బతీశారని వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్బారెడ్డి ఆరోపించారు. 'తిరుమల ప్రసాదంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దురుద్దేశంతో కూడుకున్నవి. ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరు, ఆరోపణలు చేయరు' అని సుబ్బారెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
తీపి తయారీకి నిజంగా జంతువుల కొవ్వును ఉపయోగించారా లేదా అనేది సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. నాయుడు ఆరోపణలు వేంకటేశ్వరుడిని పూజ్య దైవంగా భావించే కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని షర్మిల అన్నారు. తక్షణమే ఉన్నత స్థాయి కమిటీని వేయండి లేదా నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారా లేదా అనే దానిపై సీబీఐతో విచారణ జరిపించండి అని షర్మిల ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) దీనిని "తీవ్రమైన అంశం"గా పేర్కొంది. తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వును ఉపయోగించిన వారిని శిక్షించాలని డిమాండ్ చేసింది. "ఇది చాలా తీవ్రమైన అంశం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేవనెత్తారు, తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించిన వారిని శిక్షించండి" అని VHP జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంద్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో పవిత్ర తిరుపతి లడ్డూ ప్రసాదంలో గోమాంసం, చేప నూనెను వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని, ఇది మన సుసంపన్నమైన సాంస్కృతిక, మత వారసత్వంపై ప్రత్యక్ష దాడి అని బీజేపీ ఎమ్మెల్యే టీ రాజా సింగ్ అన్నారు.
మరోవైపు తిరుమల లడ్డూలో జంతువుల నూనెలు వాడారంటూ వైరల్ అవుతున్న ఎన్‌డీడీబీ-సీఏఎల్‌ఎఫ్ రిపోర్టులో ఆసక్తికర అంశాలు ఉన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ రిపోర్టు కొన్ని సార్లు తప్పు అయ్యే అవకాశం ఉంది. వెజిటబుల్ ఆయిల్స్ అధికంగా ఉండే మేతను ఆవులకు ఎక్కువగా ఇవ్వడం/ తక్కువ ఆహారం పెట్టడం/ పాలలోని కొలెస్ట్రాల్‌ను తొలగించడం, ఇతర టెక్నికల్ అంశాల వల్ల ఫలితాలు తప్పుగా రావొచ్చు అని రిపోర్ట్‌లో పేర్కొన్నట్టు తెలిపింది.