తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ ఆధిక్యం దిశగా దూసుకెలుతున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన వాటిలో ఆయన 61,296 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. వైసీపీకి 1,47,094 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 85,798 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 12530 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మొదటి నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 2500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.
కౌంటింగ్ సందర్భంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో 14 రౌండ్లు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో తిరుపతి లోక్‌సభకు ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరిగింది. ప్రధాన పార్టీలైన వైసీపీ నుంచి ఎం.గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ తరఫున కె.రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతామోహన్ బరిలో ఉన్నారు. వీరితో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.