త్వరలో టైమ్‌స్లాట్ ద్వారా శ్రీవారి దర్శనం: టీటీడీ
Tirumala Srivari darshan by time slot soon. త్వరలోనే తిరుమలలో టైమ్ స్లాట్ దర్శన విధానం తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన
By అంజి Published on 9 July 2022 3:04 PM IST
త్వరలోనే తిరుమలలో టైమ్ స్లాట్ దర్శన విధానం తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. జులై 11న నిర్వహించే పాలకమండలిలో టైమ్ స్లాట్ దర్శన విధానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్‌లోగా కలకంబాడి రోడ్డు, డిసెంబర్‌లోగా శ్రీనివాస సేతు రోడ్డు మార్గాన్ని పూర్తి చేస్తామని వివరించారు. ఈనెల 12 శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 17న ఆణివార ఆస్థానం వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనానికి 10 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 73, 016 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,068 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4,09 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
రెండేళ్ల తర్వాత బ్రహ్మోత్సవ వాహనసేవలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సెప్టెంబరు 27న మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 1న గరుడ వాహనం, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం జరుగనున్నాయి. అలాగే అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం ఆగస్టు 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభం కానుంది.