Tirumala: ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత.. భక్తులకు ఊరట

తిరుమల: చిన్నారి లక్షితను బలి తీసుకున్న చిరుతను పట్టుకొనేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

By అంజి  Published on  14 Aug 2023 4:02 AM GMT
Tirumala Forest officials, leopard, footpath,Tirumala

Tirumala: ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత.. భక్తులకు ఊరట 

తిరుమల: చిన్నారి లక్షితను బలి తీసుకున్న చిరుతను పట్టుకొనేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి చిరుత చిక్కింది. తిరుమల ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు చిరుతని బంధించారు. చిన్నారి లక్షితను పులి బలి తీసుకోవడంతో అధికారులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే చిరుతపులిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేశారు. బాలికపైన దాడి జరిగిన ప్రాంతంలోనే అర్ద్రరాత్రి సమయంలో బోనులో పులి చిక్కింది. బోనులో చిక్కిన చిరుత వయసు 5 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది పెద్ద చిరుత కాబట్టే.. చిన్నారిని చంపేసి ఉంటుందనీ.. అదే నెల కిందట మరో చిన్నారిపై దాడి చేసిన చిరుత వయస్సు ఏడాదిన్నర మాత్రమే.. అనీ , అందువల్లే అది ఆ చిన్నారిని చంపకుండా వదిలేసిందని అంటున్నారు. కాగా ఇప్పుడు చిక్కిన చిరుతను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్కుకి తరలిస్తున్నారు. అక్కడ ఈ చిరుతకు బ్లడ్ శాంపిల్స్ సేకరించి, ఫోరెన్సిక్ నిపుణులతో టెస్ట్ చేయిస్తారు. ఆ తర్వాత చిన్నారిని చంపినది ఈ చిరుతేనా కాదా అనేది తేలుస్తారు. ఒక వేళ చిన్నారిని చంపింది ఈ చిరుతే అయితే.. ఇది మనుషులను తినే దానిగా మారే అవకాశం ఉంంది. అలాంటప్పుడు దీన్ని తిరిగి అడవుల్లో వదలడం ప్రమాదకరం అవుతుంది.

చిన్నారిని ఇదే చంపిందని తేలితే మాత్రం.. దీన్ని జూలోనే ఉంచే అవకాశాలు ఉంటాయి. లేదంటే వేరే అడవిలో వదిలే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలిపిరి నుండి గాలిగోపురం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలు కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో రాత్రి చిరుతల సంచారం కనిపించింది. దీంతో 5 పులులు తిరుమల అడవుల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే భక్తుల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలను టీటీడీ ప్రకటించింది. 15 ఏళ్లలోపు పిల్లలను కాలినడకన మార్గాల్లో ప్రవేశం పై ఆంక్షలు విధించింది.

నడక మార్గంలో భక్తుల సంఖ్య తగ్గించటం పైనా కసరత్తులు చేస్తోంది. దర్శన టికెట్ల కోటా పెంపు ద్వారా నడక మార్గంలో రద్దీ తగ్గింపు సాధ్యమేనా అనే చర్చ సాగుతోంది. ఈ చిరుతపులుల అంశం, భక్తుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై చర్చించేందుకు ఇవాళ తిరుమలలో హైలెవెల్ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారనీ, శాశ్వత ప్రాతిపదికన భక్తుల రక్షణకు నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.

Next Story