ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ.. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో గట్టి బందోబస్తు

చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు చేపట్టిన కారు ర్యాలీని అడ్డుకునేందుకు ఏపీ సరిహద్దులో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

By అంజి  Published on  24 Sep 2023 8:22 AM GMT
Andhra Telangana border, car rally, TDP, Chandrababu

ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ.. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో గట్టి బందోబస్తు

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి వరకు ఐటీ ఉద్యోగులు చేపట్టిన కారు ర్యాలీని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కృష్ణా జిల్లా గరికపాడు అంతర్ రాష్ట్ర సరిహద్దులో శనివారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని వాహనాలను తనిఖీ చేయడంతో కొంతమంది ప్రయాణికులు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ పలువురు ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం వరకు సంఘీభావ యాత్ర నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు గచ్చిబౌలి, ఎస్​ఆర్​నగర్​, ఎల్బీనగర్​ తదితర ప్రాంతాల నుంచి యాత్రను ప్రారంభించారు.

మరోవైపు కారు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా రాజుపేట ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి చెక్‌పోస్టు వద్ద అంతర్‌రాష్ట్ర సరిహద్దులో కూడా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పోలీసుల ఆంక్షలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విమర్శించింది. "ఇది పాకిస్తాన్ సరిహద్దు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ సరిహద్దు" అని అంతర్ రాష్ట్ర సరిహద్దులో దిగిన డజన్ల కొద్దీ పోలీసుల వీడియోను టిడిపి ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ఐటీ ఉద్యోగుల ర్యాలీపై ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారని టీడీపీ ప్రశ్నించింది. టీడీపీ వృత్తి నిపుణుల విభాగం అధ్యక్షురాలు తేజస్విని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ భారతదేశంలో భాగం కాదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. దేశంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ తనకు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో తిరగడానికి తనకు స్వేచ్ఛ లేదని ఆమె అన్నారు.

హైదరాబాద్ నుంచి ప్రారంభమైన కారు ర్యాలీకి సంబంధించిన విజువల్స్ ను కూడా టీడీపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సెప్టెంబర్ 9వ తేదీన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) అరెస్టు చేసిన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ముందుజాగ్రత్త చర్యగా రాజమండ్రిలో కూడా పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. పట్టణంలో సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.

ఆదివారం రెండో రోజు కూడా చంద్రబాబుపై సీఐడీ విచారణ కొనసాగించింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ అధిష్టానాన్ని జైల్లోనే విచారిస్తున్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ ఆదివారంతో ముగియనుండడంతో, ఆదివారం సాయంత్రం సిఐడి విచారించిన అనంతరం వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.

విజయవాడ కోర్టు శుక్రవారం చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 24 వరకు పొడిగించింది. అదే రోజు కోర్టు ఆయనను రెండు రోజుల పాటు సిఐడి కస్టడీకి పంపింది. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడంతోపాటు జ్యుడీషియల్ రిమాండ్‌ను కూడా రద్దు చేయాలంటూ నాయుడు వేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను నాయుడు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆయన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Next Story