కడప పట్టణంలో ఓ మూడంతస్తుల భవనం కుంగిపోవడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంకు కాలనీలోని విద్యామందిర్ సమీపంలో వెంకటరామరాజుకు ఓ మూడంతస్తుల భవనం ఉంది. భవనం పాత బడిపోవడంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. అనంతరం మరమ్మతు పనులు చేయిస్తున్నాడు. మొదటి అంతస్తులో ఓ కుటుంబం, రెండో అంతస్తులో మరో కుటుంబం నివాసం ఉంటోంది.
బుధవారం అర్థరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా.. 12.30 గంటల సమయంలో భవనం నుంచి శబ్ధాలు వినిపించాయి. రెండో అంతస్తులో ఉంటున్న సుదర్శన్‌రాజు, మౌనిక దంపతులు బయటకు వచ్చి చూడగా.. భవనం కుంగిపోవడం కనిపించింది. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే వారు తమ పిల్లలను తీసుకుని బయటకు వచ్చేశారు. అయితే.. మొదటి అంతస్తులో ఉంటున్న సుబ్బరాయుడు కుటుంబం తలుపులు తెరచుకోకపోవడంతో అందులోనే ఉండిపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడిక చేరుకున్నారు. కిటికీ ఊచలు తొలగించి చిక్కుకుపోయిన దంపతులు, వారి పిల్లలను రక్షించారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.