సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రులు
Three Ministers take charge Today in AP.ఇటీవల నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో ముగ్గురు మంత్రులు
By తోట వంశీ కుమార్ Published on 18 April 2022 2:18 PM ISTఇటీవల నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో ముగ్గురు మంత్రులు నేడు(సోమవారం) బాధ్యతలు స్వీకరించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున, వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజిని, హోంశాఖ మంత్రిగా మంత్రి తానేటి వనిత సచివాలయంలోని తమ ఛాంబర్లలో పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
దళితుల సంక్షేమానికి కృషి చేస్తానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయనని, అంబేద్కర్ ఆలోచన, జగ్జీవన్‌రావు కాన్సెఫ్ట్‌తో ఆయన పాలన చేస్తున్నారని తెలిపారు. దళితులు ఎవ్వరికీ అన్యాయం జరగకూడదని సీఎం ఆలోచన అని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ వైద్య రంగాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని తెలిపారు. సీఎం జగన్ మూడేళ్లలో పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఏపీకి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు లభించాయన్నారు. టెక్నాలజీ వినియోగంలోనూ మన పోలీస్ విభాగం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని, రాబోయే రెండేళ్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తామన్నారు. మహిళలపై నేరాల నియంత్రణకు కృషి చేస్తాం. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడ రాజీ పడకుండా పనిచేస్తామని హోంశాఖ మంత్రి వనిత చెప్పారు.