మంగళవారం నాడు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండ్లకున సమీపంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. ఆలయం వద్ద ఏనుగుల గుంపు దాడి చేయడంతో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా వై కోట గ్రామానికి చెందిన వారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు.. దేవాలయంలో శివుడిని పూజించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఈ దుర్ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. మృతుల కుటుంబాలకి రూ.10 లక్షలు, క్షతగాత్రులకి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను, క్షతగాత్రులకు భరోసా ఇవ్వాలని రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌ను ఆదేశించారు. అలాగే మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు.