ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో భార్యను తాళ్లతో కట్టి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ చిత్రహింసలు పెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. సహకరించిన అతని అక్క, మేనల్లుడు.. దారుణాన్ని వీడియో తీసిన బాలాజీ ప్రియురాలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బాధితురాలి రెండు చేతులను పాక గుంజలకు కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు ప్రయత్నం చేశారు.
బాలాజీకి దగ్గర బంధువైన భాగ్యలక్ష్మితో తొమ్మిదేళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా బాలాజీ భార్యాపిల్లల్ని వదిలేసి వేరే మహిళతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా బేకరీలో పనిచేస్తూ భాగ్యలక్ష్మి పిల్లలను చదివిస్తుంది. అయితే శనివారం గ్రామానికి వచ్చి భార్యను డబ్బుల కోసం వేధించి.. ఆమె రెండు చేతులను తాళ్లతో గుంజలకు కట్టేసి బెల్టుతో బాదుతూ, జుట్టుపట్టుకొని వెనక్కి విరిచి కాళ్లతో తన్నుతూ రాత్రి 9 నుండి ఉదయం 5 వరకు తీవ్రంగా హింసించాడు.
మరలా సోమవారం రాత్రి ఆమెపై దాడికి ప్రయత్నించగా తప్పించుకొని సమీపంలోని చర్చి వద్దకు వెళ్లడంతో భాగ్యలక్ష్మిని స్థానికులు కాపాడారు. మొదట పోలీసులు పట్టించుకోక పోయినా.. అనంతరం వీడియో బయటకు రావడంతో స్పందించిన పోలీసులు బాలాజీతో పాటు కుటుంబ సభ్యులు అరెస్ట్ చేశారు.